తెలుగు సినీ పరిశ్రమని ఓ ప్రశ్న తీవ్రంగా వెంటాడుతోంది. పరిశ్రమకు పెద్ద దిక్కు ఎవరనే ప్రశ్న కొన్ని రోజులుగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దర్శకరత్న దాసరి నారాయణరావు మరణించాక ఆ లోటను ఎవరు భర్తీ చేస్తారనే సందేహం సినీ వర్గాలను ఆలోచనలో పడేసింది. అయితే ఆ పదవికి ఎవరు అర్హులనే ప్రశ్న సగటు సినీ కార్మికుడి మదిలో మెదులుతూనే ఉండేది. ఈ క్రమంలో చిరంజీవి, మోహన్ బాబులు పలుమార్లు స్పందించారు. దాసరి స్థానాన్ని భర్తీ చేయలేనని మోహన్ బాబు ఇప్పటికే స్పష్టం చేయగా.... ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కూడా ఆ బాధ్యతలు నాకొద్దు... అవసరానికి ఆదుకునే బిడ్డగా ఉంటానని తేల్చారు. ఈ క్రమంలో మళ్లీ సినీ పరిశ్రమకు దిక్కెవరనే ప్రశ్న మొదలైంది. తాజాగా ఈ విషయంపై ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ... దాసరికి సినీ పెద్ద అనే ఉద్యోగం ఎవరూ ఇవ్వలేదని, ఆయన చేసిన మంచి వల్లే ఆయన సినీమాకు పెద్ద దిక్కయ్యారన్నారు. దాసరి లాగా ఇప్పుడు సినిమా వాళ్ల కష్టాల్లో పాలుపంచుకునేంత సమయం ఇచ్చే వారు ఎవరూ లేరన్నారు. కానీ చిరంజీవి మాత్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, అవసరానికి అందుబాటులో ఉంటానన్న మెగాస్టార్.... కార్మికుల కోసం పెద్దగా ఉండే తీరాలని పట్టుపట్టారు. అసలు దాసరి సినీ పెద్దగా ఎలా అయ్యారు. సినీ పెద్ద కావాలంటే ఎలాంటి లక్షణాలు ఉండాలో తమ్మారెడ్డి వివరించారు.
" దాసరి స్థానం ఎవరు భర్తీ చేయలేరు. ఆయన మల్టీ టాలెంటెడ్. డైరెక్టర్, నిర్మాత, డిస్టిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్, నటుడు, పొలిటిషియన్ అన్నీ. ఆయనకు అన్ని విభాగాల మీద పట్టుంది. వ్యక్తుల మీద పట్టుంది. అందుకే ఆయన శక్తి అయ్యాడు. దాసరి లాగా అన్ని తెలిసిన మనుషులు ఇక్కడ లేరు. చిరంజీవి గారు చాలా లిమిటెడ్. ఆయన వరకు చేస్తున్నారు. దాసరి నారాయణరావును రీప్లేస్ చేయక్కర్లేదు. చిరంజీవిగారు చిరంజీవిగారి లాగానే ఉంటారు. దాసరికి సినిమా పెద్ద అని ఉద్యోగం ఎవరూ ఇవ్వలేదు. ఆయన చేసిన పనుల వల్లే పెద్ద మనిషిగా వెలుగులోకి వచ్చారు. కష్టమున్న ప్రతివాడు ఆయన దగ్గరికి వెళ్లి చెప్పుకుంటే పరిష్కరించేవాడు. కాబట్టి ఆయన సినిమా పెద్ద అయ్యాడు. రాత్రి పగలు అందుబాటులో ఉండేవారు. అలా సమయం కేటాయించే వ్యక్తులు ఇప్పుడు ఎవరూ లేరు. చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు వాళ్ల పరిధిలో చేయాల్సి పనులు చేస్తున్నారు. మిగిలిన హీరోలు, డైరెక్టర్లు అందరూ వాళ్ల మనుషులకు, తెలిసినవాళ్లకు సహాయపడుతున్నారు. కాకపోతే దాసరి ముక్కుముఖం తెలియని వాడికి కూడా సహాయం చేసేవారు. అదే .... దాసరికీ ఇప్పుడున్నవాళ్లకు తేడా. చిరంజీవి మాట్లాడుతూ సినీ పెద్ద బాధ్యతలు అక్కర్లేదన్నారు. ఆయనెవరు అలా అనడానికి. ఉండి తీరాల్సిందే. చిరంజీవిగారు ఒక లెవల్ కు వెళ్లిపోయారు. ఏ అవసరం వచ్చినా అండగా ఉంటాను అన్నారు. పెద్ద మనిషి అని చెప్పి కొందరు వెనుక నుంచి తప్పుగా మాట్లాడుతుంటే మనసుకు బాధకలిగి చిరంజీవి అలా మాట్లాడారు. చిరంజీవి స్థాయికి దుప్పటి పంచాయితీలకు ఎందుకు రావాలి. ఇండస్ట్రీలో తిరుగులేని నటుడు, మంత్రిగా పనిచేశారు. మెగాస్టార్ ఆయన. మూడు నాలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అవసరం వస్తే ముందుకు వస్తానని చెప్పారు "
తమ్మారెడ్డి మాటలను బట్టి చూస్తే సినీ పరిశ్రమకు, కార్మికులకు పెద్ద దిక్కు చిరంజీవినే అని అర్థమవుతోంది. గతంలో మురళీమోహన్, ప్రకాశ్ రాజ్ లాంటి సీనియర్ నటులు కూడా చిరంజీవికే ఓటు వేశారు.
Post a Comment