ఎవరితో పొత్తులో ఉండాలనేది ఆరోజు నిర్ణయిస్తానుః పవన్ కళ్యాణ్

 


ఇతర పార్టీలతో పొత్తులపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ భాజపాతో పొత్తులో ఉందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకోవాలనే విషయాన్ని తానొక్కడినే నిర్ణయం తీసుకోలేనని వెల్లడించారు. ప్రతి జనసేన కార్యకర్త ఆలోచనలు, అభిప్రాయాలు తీసుకున్నాకే 2024 ఎన్నికల్లో ఎవరితో కలిసి వెళ్లాలలనేది నిర్ణయించుకుందామని తెలిపారు. అప్పటి వరకు పార్జీ శ్రేణులంతా ఒకటే మాట మీద ఉండాలని పవన్ సూచించారు. జనసేన కార్యనిర్వాహక సభ్యులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన పవన్ కల్యాణ్.... క్షేత్ర స్థాయిలో జనసేన పుంజుకుంటుందని తెలిపారు. ఈ క్రమంలో రకరకాల పార్టీలు జనసేనతో పొత్తు కోరవచ్చన్న పవన్.... మిగతా పార్టీల మైండ్ గేమ్ లో జనసైనికులు పావులుగా మారవద్దని హితవు పలికారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టిపెట్టాలని సూచించారు. అలాగే గతేడాది కొవిడ్ కారణంగా పార్టీ ఆవిర్భావ సభను జరుపుకోలేదని, ఈ ఏడాది ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పవన్ వెల్లడించారు. ఇందుకోసం ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నామని శ్రేణులకు సూచించిన పవన్ కల్యాణ్... కమిటీ దిశానిర్దేశం మేరకు మార్చి 14న జనసేన ఆవిర్భావ సభ ఉంటుందని తెలిపారు. ఆ సభలో 2024 ఎన్నికలకు కావల్సిన ఆలోచనలు చేయనున్నట్లు పార్టీ శ్రేణులకు వివరించారు. సంక్రాంతి తర్వాత మరోసారి పార్టీ శ్రేణులతో సమావేశం కానున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.

Post a Comment

Previous Post Next Post