ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన సినీ ప్రస్థానంపై భావోద్వేగానికి గురయ్యారు. గత 18 ఏళ్లుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన దిల్ రాజు... తాజాగా ఓటీటీ కోసం ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ తో కలిసి వెబ్ సిరీస్ లను రూపొందిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా దిల్ రాజు ప్రొడక్షన్స్ పేరుతో సంస్థను ప్రారంభించారు. ఆ సంస్థ బాధ్యతలను తన కుమారుడు హర్షిత్, హన్వితారెడ్డిలకు అప్పగించిన దిల్ రాజు.... సురేష్ ప్రొడక్షన్స్ సంస్థను పేర్కొంటూ ఆ సంస్థ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ఆ సంస్థ లాగే తాను కూడా ఇండస్ట్రీలో 50 ఏళ్లు నిర్మాతగా ఉండాలని, ఆ రోజును చూశాకే రిటైర్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడ్ని కోరుకుంటున్నట్లు ఆకాంక్షించారు.
ఇంకా దిల్ రాజు ఏమన్నారంటే....
" 23 ఏళ్ల కిందట శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్ ను స్థాపించాం. డిస్ట్రిబ్యూటర్ గా మొదలై ఎన్నో విజయాలు అందుకున్న నాకు తర్వాత ఏంటనే ప్రశ్న మొదలైంది. అప్పుడు 2003లో నిర్మాతగా మారి దిల్ సినిమా తీశాం. అక్కడి నుంచి మీ అందరికి తెలుసు. కొత్త వాళ్లను పరిచయం చేస్తూ ఆర్య, భద్ర, బొమ్మరిల్లు, మున్నా, పరుగు, కొత్త బంగారు లోకం... ఇలా... ఎన్నో విజయాలతో సక్సె్స్ ఫుల్ నిర్మాత అనిపించుకున్నాను. ఇది దిల్ రాజు సినిమా, ఇది వెంకటేశ్వర క్రియేషన్స్ సినిమా అనే నమ్మకం ప్రేక్షకుల్లో కలిగింది. ఇండస్ట్రీలో సక్సెస్ పుల్ సంస్థగా అనిపించుకోవడం జరిగింది. దాదాపు 18 ఏళ్లు పూర్తయ్యాయి. స్టార్స్ తో, కొత్త వాళ్లతో సినిమాలు తీస్తూ మా సంస్థను నిలబెట్టడం, ప్రేక్షకులకు హిట్ సినిమాలు ఇవ్వడం కోసం ప్రయత్నించా. మా సంస్థ ఈ రోజు ఈ స్థాయిలో ఉండటానికి ఎంతో మంది దర్శకుల కృషి ఉంది. వాళ్లందరికి నా ధన్యవాదాలు. ఈ ప్రయాణంలో దాదాపు 50 సినిమాలు నిర్మించగలిగాం. సినిమాతోపాటు ఎన్నో మార్పులు వస్తున్నాయి. డిస్టిబ్యూటర్ నుంచి నిర్మాతగా మారాం. ఇప్పుడు మళ్లీ ఏం చేయాలనే ఆలోచన వచ్చింది. దిల్ రాజు ప్రొడక్షన్స్ పెడదామని నిర్ణయించుకున్నాం. అయితే ప్రేక్షకుల్లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ పేరు బలంగా నాటుకుపోయింది. దిల్ రాజు ప్రొడక్షన్స్ లో ఏం చేయాలి అనుకున్నప్పుడు హిందీలోకి కూడా అడుగుపెట్టాం. అక్కడ సక్సెస్ పుల్ గా ప్రాజెక్టులు సెట్ అయ్యాయి. జర్సీ, హిట్ చిత్రాలు పూర్తి చేశాం. ఈ ఏడాది దిల్ రాజు ప్రొడక్షన్స్ పేరుతో ఆ చిత్రాలు విడుదలవుతాయి. అయితే తెలుగులో దిల్ రాజు ప్రొడక్షన్స్ లో కొత్తగా ఏం చేయాలని ఆలోచించినప్పుడు వెబ్ సిరీస్ లు చేయాలనే ఆలోచన హరీశ్ శంకర్ తీసుకొచ్చాడు. అప్పుడే మాకు ఎప్పుడు పగ్గాలు ఇస్తారా అని ఎదురుచూస్తున్న హర్షిత్, హన్వితాలతో మాట్లాడాను. దిల్ రాజు ప్రొడక్షన్స్ బాధ్యతలను వాళ్లకు అప్పగించాం. అయితే సక్సెస్ పుల్ నిర్మాతగా సుమారు 50 సినిమాలు చేశాను. ఇప్పుడు నా బుర్రకు పెద్దగా పని చెప్పడం లేదు. మా వాళ్లు కొత్తగా ఏం చేస్తారో చూస్తున్నాం. దిల్ రాజు ప్రొడక్షన్స్ లో హర్షిత్, హన్వితా మరో రెండు సినిమాలు తయారు చేశారు. నేను ఎలాగైతే ఎస్వీసీని తీసుకొచ్చానో హర్షిత్, హన్విత కూడా అలాగే తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. కొంత మందికే చాలా సుదీర్ఘమైన ప్రయాణం ఉంటుంది. అలా వెనక్కి తిరిగి చూసుకుంటే సురేష్ ప్రొడక్షన్స్ 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆ సందర్భంగా వాళ్లు ఒక లోగో తయారు చేశారు. నా ప్రొడక్షన్ హౌజ్ 18 పూర్తి చేసుకుంది. నేను కూడా నా జీవితంలో 50 ఏళ్లు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ ఫిల్లర్ ను మా పిల్లలు అలాగే తీసుకెళ్తారని అనుకుంటున్నా. నా లైఫ్ ఎగ్జిట్ అక్కడ కనిపిస్తుంది. భగవంతుడు నాకు ఆయుష్షు ఇస్తే మా సంస్థ 50 ఏళ్లను చూడాలని కోరుకుంటున్నా. "
Post a Comment