ఈ సంక్రాంతి బరిలో నిలిచిన బంగార్రాజు బాక్సాఫీసు వద్ద ఘన విజయాన్ని అందుకున్నాడు. కరోనా పరిస్థితుల్లో కూడా ప్రేక్షకులు బంగార్రాజును ఆదరించారు. తొలిరోజే రూ.17.50 కోట్లు గ్రాస్ సాధించింది. ఈ సందర్భంగా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ నాగార్జున తన టీంతో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. బంగార్రాజుకు వస్తోన్న ఆదరణ పట్ల నాగ్ సంతోషం వ్యక్తం చేశారు. అమల సినిమా చూసి వచ్చిన తర్వాత ఇంట్లో నేరుగా వెళ్లి అత్తామామలకు దండం పెట్టుకొని ఏడ్చిందని నాగార్జున తెలిపారు. సినిమా చూస్తుంటే వాళ్లు గుర్తొచ్చారని, ఎల్లప్పుడు పెద్దలు మనవెంటే ఉంటారన్న విషయం గుర్తొచ్చిందని అమల భావోద్వేగానికి గురైనట్లు నాగార్జున వివరించారు. ఇదే ఉద్వేగం ప్రేక్షకుల్లోనూ కలుగుతుందన్నారు. పెద్ద బంగార్రాజు- సత్యభామలను చూసి తమ పెద్దలు, అమ్మమ్మలు, తాతయ్యలు గుర్తొస్తున్నట్లు చెబుతున్నారని నాగార్జున పేర్కొన్నారు. బంగార్రాజు సంక్రాంతికి విడుదల చేయడమే సరైన ఫ్లాట్ ఫాం అన్న నాగార్జున... ఇక నుంచి ప్రతి సంక్రాంతికి ఓ సినిమా ప్లాన్ చేసుకుంటారా? అన్న మీడియా ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అలా అన్ని సినిమాలకు కుదరదని, చాలా మంది హీరోల సినిమాలు ఉంటాయని, ఇంటిల్లిపాది చూసేలా ఉండే సినిమాలే సంక్రాంతికి సక్సెస్ అవుతాయన్నారు. అలాగే బంగార్రాజుకు కూడా సీక్వెల్ ఉంటుందని స్పష్టం చేశారు. సమయం తీసుకొని ఆ సినిమాకు ప్లాన్ చేస్తామని నాగార్జున తెలిపారు.
Post a Comment