- బాస్ వెంటే పెద్ద సినిమాల నడక
- ఏప్రిల్ నుంచి మొదలుకానున్న భారీ బడ్జెట్ చిత్రాల జోరు
టాలీవుడ్ కు కరోనా సినిమా చూపిస్తుంది. కరోనా దెబ్బకు భారీ బడ్జెట్ సినిమాలన్నీ ఇప్పటికే వాయిదా పడ్డాయి. దేశవ్యాప్తంగా థియేటర్లపై ఆంక్షలు, కొన్ని రాష్ట్రాల్లో పూర్తిగా మూసివేత కారణంగా పెట్టిన బడ్జెట్ కూడా తిరిగి వస్తుందన్న నమ్మకం లేకపోవడంతో ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ లాంటి చిత్రాలు అనుకున్న తేదీకి రాలేకపోయాయి. అటు బాలీవుడ్ లోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో చేసిన ప్రమోషన్ అంతా వృథా అయిపోయింది. ప్రేక్షకుల్లోనూ నిరుత్సాహం తప్పలేదు. అయితే మళ్లీ ఆ చిత్రాల జోరు ఎప్పుడనేది ఇప్పటికైతే స్పష్టత రాలేదు.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్రాన్ని ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ కు జరిపారు. ఫిబ్రవరి 4న విడుదల కావాల్సిన ఆచార్యను ఏప్రిల్ 1కి మార్చారు. అదే ఏప్రిల్ 1న విడుదల కావల్సిన సర్కారు వారి పాట... ఎప్పుడు విడుదలవుతుందో ఇంకా స్పష్టత రాలేదు. ఆచార్య తేదీ ఖరారు కావడంతో ఫిబ్రవరిలో నెలలో రావల్సిన అడవి శేషు మేజర్, రవితేజ ఖిలాడి, నిఖిల్ 18 పేజీలు, పవన్ కల్యాణ్-రానాల భీమ్లానాయక్ లు ఏప్రిల్ తర్వాత రాబోతున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి, మార్చిలో పూర్తిగా పాన్ ఇండియా స్థాయి లేదంటే రెండు మూడు భాషల్లో నిర్మించిన చిత్రాలు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.
ఇప్పటికే నాలుగుసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఆర్ఆర్ఆర్ కూడా ఆచార్య తర్వాతే విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. జనవరి 7న విడుదల కావల్సిన ఈ చిత్రాన్ని కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా వేశారు. పరిస్థితులు కుదుటపడ్డాక ఏప్రిల్ 1 విడుదల చేయాలని అనుకున్నారట. కానీ అదే తేదీకి చిరంజీవి ఆచార్య విడుదల చేస్తుండటంతో అప్పుడున్న పరిస్థితులను చూసి ఆర్ఆర్ఆర్ కొత్త తేదీని రాజమౌళి వెల్లడించనున్నారు. అదే బాటలో రాధేశ్యామ్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మే లో రాధేశ్యామ్ రిలీజ్ కానుంది. ఆ తర్వాతే మిగతా సినిమాల విడుదలవుతాయని ఫిల్మ్ నగర్ వర్గాలు భావిస్తున్నాయి.
ఒమిక్రాన్ వెరియంట్ ఉద్ధృతితో మొత్తం చిన్నాభిన్నమైన టాలీవుడ్ పరిస్థితిని మళ్లీ చక్కబెట్టేందుకు
తెలుగు ప్రొడ్యూసర్ గిల్డ్ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే పెద్ద సినిమాలన్నీ వాయిదా పడటం, చిన్న సినిమాలన్నీ విడుదలకు సిద్ధమవుతుండటంతో అన్నింటికి విడుదల తేదీలు, థియేటర్ల సర్దుబాటు చేసే విషయంపై ఆలోచిస్తున్నారు.
ఈలోగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా టికెట్ ధరలపై స్పష్టత నిస్తూ కొత్త జీవో విడుదల చేసేందుకు కమిటీతో కసరత్తులు చేస్తోంది. రానున్న రెండు మూడు నెలల్లో కరోనా ఉద్ధృతి తగ్గుతుందని భావిస్తున్న సినీ పరిశ్రమ వర్గాలు... ఏప్రిల్ నుంచి టాలీవుడ్ కు మంచి రోజులు వస్తాయని భావిస్తున్నారు.
Post a Comment