రాజకీయాలకు తాను దూరంగా ఉన్నానని ప్రముఖ సినీనటుడు, మెగాస్టార్ చిరంజీవి మరోసారి స్పష్టం చేశారు. చిరంజీవికి వైఎస్ఆర్ పార్టీ రాజ్యసభ సీటు ఇస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంపై విజయవాడ వెళ్లిన మెగాస్టార్ స్పందించారు. తాను పదవులకు లోబడే వ్యక్తిని కాదని పేర్కొన్నారు. తనకు రాజ్యసభ సీటు ఇస్తారన్న వార్తలు ఊహా జనితమేనని, వాటిని ఖండిస్తున్నట్లు చెప్పారు. రాజకీయాలకు దూరంగా ఉన్న తనకు ఇలాంటి ఆఫర్లు రావని, వాటిని కోరుకోనని తెలిపారు. పదవులు కోరుకోవడం తన అభిమతం కాదని చిరంజీవి వెల్లడించారు. సినీ పరిశ్రమకు చంెదిన సమస్యలపై నిన్న ముఖ్యమంత్రి జగన్ తో చిరంజీవి ఏకాంతంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో చిరంజీవికి జగన్ రాజ్యసభ సీటు ఆఫర్ చేసినట్లు ప్రచారం జరిగింది. ఈ ప్రచారంపై స్పందించిన చిరంజీవి... తాను పదవులకు లొంగే మనిషిని కాదని ఖరాఖండిగా తేల్చి చెప్పారు. అయితే చిరంజీవి ఇవాళ కూడా విజయవాడ ఎందుకు వెళ్లారనే ప్రశ్న ఉత్పన్న కావడంతో సగటు అభిమానులు ఆరా తీశారు. నిన్న సీఎంతోభేటీ అంశాలపై ప్రభుత్వం నియమించిన కమిటీతో సమావేశమయ్యేందుకు చిరంజీవి విజయవాడ వచ్చినట్లు తెలుస్తోంది. ఉదయం రవితేజ నటిస్తున్న రావణాసుర మూవీ ప్రారంభోత్సవానికి హాజరై క్లాప్ కొట్టారు. అనంతరం చిరు విజయవాడ వెళ్లారు.
Post a Comment