తలపై పెరిగే జుట్టు కొద్ది రోజులు మనకు చికాకుగా అనిపించినా ఎదుటి వారికి ఆనందాన్ని ఇస్తుందంటే నమ్ముతారా? అవును..! మన ఇష్టంగా బాగా పెంచే జుట్టు మరొకరికి ఆనందాన్ని, అందాన్ని ఇస్తుంది. ఇదే విషయాన్ని రుజువు చేశారు ప్రముఖ యువ సంగీత సంచలనం PR. నల్లమల చిత్రంలో ఏమున్నావే పిల్ల పాటతో సినీ సంగీత ప్రపంచంలో మంచి గుర్తింపు తెచ్చుకొని వరుస సినిమాలో బిజీగా ఉన్న PR..కొన్నాళ్లుగా తన జుట్టును విపరీతంగా పెంచారు. సినిమా వాళ్లు పనిలోపడి ఇలాగే పెంచుతారని కొందరు, ఇలా ఒత్తుగా, పొడవుగా ఫ్యాషన్ గా పెంచుకోవడం అలవాటని మరికొందరు అభిప్రాయపడ్డారు. కానీ అభిప్రాయాలను తలకిందులు చేస్తూ ఒక మంచిపని కోసం PR జుట్టు పెంచారు. క్యాన్సర్ తో బాధపడుతున్న రోగులు తమ జుట్టు కోల్పోతారు. వారికి ఆ బాధ తెలియకుండా హైదరాబాద్ లోని హైదరాబాద్ హెయిర్ డొనేషన్ అనే స్వచ్చంద సంస్థ .. చాలా రోజుల నుంచి హెయిర్ ను సేకరిస్తుంది. అలా సేకరించిన వాటిని విగ్గులుగా తయారుచేసి క్యాన్సర్ బాధితులకు తలవెంట్రుకలు లేవనే లోటును తీరుస్తూ ఆదుకుంటుంది. ఈ క్రమంలోనే PR కూడా క్యాన్సర్ బాధితులను ఆదుకునేందుకు తన జుట్టును దానం చేశారు. ఈ సందర్భంగా తన ఆనందాన్ని వ్యక్తం చేసిన PR... జుట్టు పోతే మళ్లీ ఏడాదిలో పెరుగుతుంది. కానీ బాధితుల ముఖాల్లో సంతోషం చూడాలంటే తన వంతు ఈ చిన్న సహాయం చేయడం ఎంతో తృప్తిగా ఉందన్నారు. ఏడాదికోసారైనా క్యాన్సర్ బాధితుల కోసం జుట్టు దానం చేయాలని యువతకు PR విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం PR సంగీతాన్ని అందించిన ఉనికి చిత్రం విడుదల కాగా నల్లమల సహా మరికొన్ని చిత్రాలు విడుదల సన్నాహాల్లో ఉన్నాయి.
Post a Comment