గుడ్ లక్ సఖి చూడాలంటే ప్రేక్షకులకు ఈ "మూడు" ఉండాలి
కీర్తి సురేష్ నటించిన లెటెస్ట్ మూవీ గుడ్ లక్ సఖి ఎట్టకేలకు విడుదలైంది. చాలా రోజుల నుంచి ఈ సినిమా విడుదల చేయాలని చూస్తున్నా... కరోనా పరిస్థితులు సఖికి బ్యాడ్ డేస్ గానే మారాయి. కానీ మేకర్స్ సఖికి జనవరి 28 గుడ్ లక్ అని భావించి విడుదల చేశారు. అయితే ఈ మూవీని చూడాలంటే ప్రేక్షకుడికి తప్పకుండా మూడు లక్షణాలు ఉండాలి. సినిమాలో సఖి పాత్రకు కల్నల్ చెప్పినట్టుగా... శాంతం... స్థిరం.. ఏకాగ్రత. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మూడు లక్షణాలు మీలో ఉన్నాయని భావిస్తే తప్పకుండా సఖికి వెళ్లొచ్చు.
అయితే సఖి కథేంటీ అంటారా...?
ఈ సినిమా ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికి కథ అర్థమవుతుంది. అర్థం కాకపోతే మరోసారి కథను టూకీగా చెబుతాను. చదవండి.
" ఓ పల్లెటూరు. ఆ పల్లెలోని బంజారా కుటుంబంలో జన్మించిన యువతి సఖి పారికర్(కీర్తి సురేష్). తనను ఎప్పుడూ దురదృష్టం వెంటాడుతుంటుంది. పెళ్లి చేద్దామనుకున్నా పెళ్లి కొడుకు పీటల దాకా కూడా రాడు. ఇలాంటి పరిస్థితుల్లో అందరు తనను బ్యాడ్ లక్ సఖీ అంటుంటారు. కానీ సఖిలో చిన్నప్పటి నుంచి గొప్ప టాలెంట్ ఉంటుంది. గోళీలను గురి చూసి కొట్టడం. గుండెతో గురిచూసి కొట్టు విజయం మనదే అనే గోళిరాజు(ఆది పిన్నిశెట్టి) మాటతో... సఖి గురి తప్పదు. అలాంటి సఖి టాలెంట్ ను గుర్తించిన ఆ ఊరి కల్నల్(జగపతిబాబు)... రైఫిల్ షూటింగ్ లో ట్రైనింగ్ ఇస్తాడు. కల్నల్ ట్రైనింగ్ లో రైఫిల్ షూటింగ్ ఎలా చేయాలో నేర్చుకున్న సఖి... తనపై ముద్ర పడ్డ బ్యాడ్ లక్ ను చేరిపేసుకుందా? రాష్ట్ర స్థాయి పోటీల్లో ఎలా గెలిచింది? సఖిని ఇష్టపడ్డ గోళిరాజు పరిస్థితి ఏమైందనేది ఈ సినిమా కథ "
మహానటి తర్వాత కీర్తి సురేష్ ఎంచుకుంటున్న మహిళా ప్రాధాన్యత ఉన్న చిత్రాలన్నీ పరాజయం పాలయ్యాయి. పెంగ్విన్, మిస్ ఇండియా. ఇప్పుడు ఈ చిత్రం కూడా అదే బాట పట్టింది. మొదట ఈ చిత్రానికి బ్యాడ్ లక్ సఖి అనుకున్నారట. కానీ దిల్ రాజు చొరవతో గుడ్ లక్ సఖిగా మార్చుకున్నా.... సినిమాకు ఆ అదృష్టం లేకుండా పోయింది. సినిమా మొదటి నుంచి చివరి వరకు ఒకే రకమైన పంథాలో వెళ్తుంది. కథ, కథనాలు ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడతాయి. కీర్తి సురేష్, జగపతిబాబుల డబ్బింగ్ సరిగా సింక్ అవకపోవడంతో కొన్ని చోట్ల చిరాకు తెప్పిస్తాయి. పాటలు, మాటల వరకు ఫర్వాలేదనిపించినా.... కథనం పూర్తిగా గురితప్పింది. దర్శకుడు నగేశ్ కుకునూరికి అంతర్జాతీయ సినిమా అనుభవం సఖికి పెద్దగా కలిసిరాలేదు. వినోదానికి చోటు ఇవ్వకపోవడంతో ప్రేక్షకుడి మనోభావాలు పూర్తిగా దెబ్బతిన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. నటిగా కీర్తి తన పాత్ర కోసం బాగానే కష్టపడిన అదంతా బూడిదలో పోసిన పన్నీరే అయ్యింది. జగపతిబాబు చాలా రోటిన్ పాత్రే. ఆదిపిన్నిశెట్టి, రాహుల్ రామకృష్ణ పాత్రల్లో కొత్తదనం ఏమీ లేదు. సాంకేతికంగా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉండేది. నిర్మాణ పరంగా ఫర్వాలేదనిపించినా... సినిమా ఫలితాన్ని చూస్తే ఆ డబ్బు తిరిగొస్తుందన్న గ్యారంటీ అయితే లేదని చెప్పక తప్పదు.
Post a Comment