హీరో రివ్యూ: 3/5


మహేశ్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ నటించిన ఫస్ట్  మూవీ హీరో. శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ లో అనుకోకుండా ఈ సంక్రాంతికి దొరికిన ఖాళీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.. కృష్ణ, మహేశ్ బాబులకు ఎంతో కలిసొచ్చిన ఈ సంక్రాంతి అశోక్ కు కలిసొచ్చిందా లేదో తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. అయితే కథేంటంటారా...?

ఇదొక సినిమా క్రైమ్ డ్రామా.  సినిమా హీరో అవ్వాలని కలలు కనే మధ్యతరగతి కుర్రాడు అర్జున్ (అశోక్ ).
ప‌క్కింటి అమ్మాయి సుబ్బలక్ష్మి (నిధి అగ‌ర్వాల్‌)ని చూసి ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఇద్ద‌రూ పెళ్లి చేసుకోవాల‌ని కూడా నిర్ణ‌యించుకుంటారు. ఇంత‌లో  అర్జున్ చేతికి  ఓ కొరియ‌ర్ వస్తుంది. అందులో ఓ గ‌న్ ఉంటుంది.  ముంబై మాఫియాకి చెందిన గ‌న్ అది. ఆ త‌ర్వాత మరో  కొరియ‌ర్‌లో చంప‌మ‌ని చెబుతూ ఓ ఫొటో అందుతుంది. ఆ గ‌న్‌ని, ఫొటోని అర్జున్‌కి పంప‌డానికి కార‌ణ‌మేమిటి?  ఇంత‌కీ ఆ ఫొటోలో ఎవ‌రున్నారు?  ముంబై మాఫియాకీ, అర్జున్‌కీ సంబంధ‌మేమిటి?  అర్జున్ హీరో అయ్యాడా?  సుబ్బుని పెళ్లి చేసుకున్నాడా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఓ కొత్త హీరోని ప‌రిచ‌యం చేస్తున్న‌ప్పుడు... అది కూడా సినీ కుటుంబానికి చెందిన వార‌సుడు అన్న‌ప్పుడు ఎక్కువ‌గా అల‌వాటైన మాస్ క‌థ‌ల‌నో లేదంటే ప్రేమ‌క‌థ‌ల‌నో  ఎంచుకుంటుంటారు ద‌ర్శ‌కులు. శ్రీరామ్ ఆదిత్య మాత్రం మ‌రోసారి త‌న ప్ర‌త్యేక‌త‌ని ప్ర‌ద‌ర్శిస్తూ, సినిమాలో  అనిల్ రావిపూడి చెప్పిన‌ట్టుగా  ఔట్ ఆఫ్ ది బాక్స్‌గా ఆలోచించి కామెడీతో కూడిన  ఓ కొత్త ర‌క‌మైన క‌థ‌ని రాసుకున్నారు. అదే స‌మ‌యంలో  హీరో స్కిల్స్‌ని బ‌య‌ట‌పెట్టే అంశాలు కూడా ఇందులో ఉండ‌టం మ‌రింత ప్ర‌త్యేకం. ఇదొక కొత్త ర‌క‌మైన జోన‌ర్ సినిమా అని చెప్పొచ్చు.  ప్రేమ‌, మాఫియా నేప‌థ్యం, థ్రిల్లింగ్ అంశాలు, హ్యూమ‌ర్‌ని మేళ‌వించి  సినిమా నేప‌థ్యంలో సాగే క‌థ‌తో ఈ సినిమాని తీయ‌డం మెప్పిస్తుంది. ఫస్టాప్ రేసీగా సాగే క‌థ‌నంతో సినిమా చ‌క్క‌టి వినోదాన్ని పంచుతుంది.  హీరో ప‌రిచ‌య స‌న్నివేశాలు మొద‌లుకొని, అత‌ని ప్రేమ‌క‌థ‌, ఆ త‌ర్వాత గ‌న్ చేతికందాక చోటు చేసుకునే మ‌లుపులు ఆస‌క్తిని రేకెత్తిస్తాయి. ద్వితీయార్థంలోనే క‌థని సాగ‌దీసిన‌ట్టు అనిపిస్తుంది. మాఫియా నేప‌థ్యాన్ని మ‌రీ సిల్లీగా మ‌ల‌చ‌డం, సీఐపై జ‌రిగిన ఫైరింగ్ కేసుని వ‌దిలేయ‌డంతో  అప్ప‌టిదాకా ఆస‌క్తిక‌రంగా అనిపించిన సినిమా  కాస్త గాడిత‌ప్పిన‌ట్టుగా అనిపిస్తుంది. మూల క‌థ మ‌రీ ప‌ల‌చ‌గా ఉండ‌టంతో  క‌థ అక్క‌డ‌క్క‌డే తిరిగిన‌ట్టుగా అనిపిస్తుంది. అయితే కామెడీ మాత్రం చివ‌రి వ‌ర‌కూ పండటం సినిమాకి క‌లిసొచ్చే విష‌యం. ప‌తాక స‌న్నివేశాల్లో బ్ర‌హ్మాజీ నేప‌థ్యంలో పండే కామెడీ సినిమాకి  హైలెట్‌గా నిలిచింది.  కృష్ణ కుటుంబం నుంచి వ‌చ్చిన వారసుడు, సినిమా నేప‌థ్య‌మున్న క‌థ కావ‌డంతో కృష్ణ‌, మ‌హేష్‌బాబు ప్ర‌స్తావ‌న సినిమాలో చాలాచోట్ల వ‌స్తుంది. ఆ స‌న్నివేశాల‌న్నీ కూడా అభిమానుల్ని మెప్పించేవే. అశోక్ గ‌ల్లా ఉత్సాహంగా క‌నిపించారు.  తొలి సినిమానే అయినా కామెడీ ప‌రంగానూ,  డ్యాన్స్‌ల ప‌రంగానూ ఆక‌ట్టుకున్నాడు. ఇక లుక్స్ విష‌యానికొస్తే సినిమాలో  రైట్ ప్రొఫైల్‌లో బాగుంటాన‌ని ఇందులో ఓ డైలాగ్ చెబుతాడు హీరో.  ఆ డైలాగ్‌కి త‌గ్గ‌ట్టే  హీరో కొన్ని యాంగిల్స్‌లో బాగా క‌నిపిస్తారు. నిధి అగ‌ర్వాల్ పాత్ర‌కి పెద్ద‌గా ప్రాధాన్యం లేదు కానీ, ఉన్నంత‌లో అందంగా క‌నిపించింది. ముద్దు స‌న్నివేశాల్లో మురిపించింది. జ‌గ‌ప‌తిబాబు పాత్ర‌లో కోణాలు ఆక‌ట్టుకుంటాయి.  న‌రేష్ అల‌వాటైన పాత్ర‌లో క‌నిపించి న‌వ్వించారు.  ఆరంభ స‌న్నివేశాల్లో ఆయ‌న హంగామా  మెప్పిస్తుంది.  బ్ర‌హ్మాజీ ,  వెన్నెల కిషోర్‌, స‌త్య న‌వ్వించారు. ముఖ్యంగా బ్ర‌హ్మాజీ ప‌తాక స‌న్నివేశాల్లో పాన్ ఇండియా అంటూ సీనియ‌ర్ హీరో పాత్ర‌లో చేసిన హంగామా క‌డుపుబ్బా  న‌వ్విస్తుంది.  అక్క‌డే ఓ ద‌ర్శ‌కుడి శైలిని పోలిన స‌న్నివేశాలు కూడా కామెడీని పంచుతాయి.  సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. రిచ‌ర్డ్‌, స‌మీర్‌రెడ్డి కెమెరా ప‌నిత‌నం సినిమాకి ఓ ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. ర‌చ్చ ర‌విని ఛేజ్ చేసే స‌న్నివేశాల్లో విజువ‌ల్స్,  కొన్ని పాట‌ల చిత్రీక‌ర‌ణ,  ఆరంభ స‌న్నివేశాలు కెమెరా విభాగం  ప‌నిత‌నంలో నాణ్య‌త‌ని  చాటిచెబుతాయి. మాట‌లు బాగున్నాయి. ద‌ర్శ‌కుడు శ్రీరామ్ ఆదిత్య ఆలోచ‌న‌లు కొత్త‌గా ఉంటాయ‌న‌డానికి ఈ సినిమా మ‌రో ఉదాహ‌ర‌ణ‌. కాక‌పోతే ఆయ‌న క‌థ విస్తృతి ప‌రంగా చేసిన క‌స‌ర‌త్తులు  చాల‌లేదు. నిర్మాణ విలువ‌లు ఉన్న‌తంగా ఉన్నాయి. కథ, కథనం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. ఈ సంక్రాంతికి మహేశ్ బాబు సినిమా రాకపోయినా ఆయన మేనల్లుడికి పండగలాంటి సినిమా హీరో. అశోక్ ను హీరోగా చేసిన పండుగ ఇది. మొత్తానికి ఈ హీరో బాగా నవ్విస్తాడు. 

Post a Comment

Previous Post Next Post