అందుకే నానితో ఆ సీన్స్ లో నటించా

 


    బేబమ్మ... ఈ పేరు వినగానే వెంటనే గుర్తొస్తుంది ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి. ఫస్ట్ మూవీతోనే టాప్ హీరోయిన్ కేటగిరిలో చేరిపోయిన ఈ అమ్మడు.... వరుస సినిమాలతో జోరుమీదుంది. 2021 చివరలో శ్యామ్ సింగరాయ్ తో రొమాంటిక్ గా కనిపించి తన అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చింది. ఏంటీ బేబమ్మ నానితో తెగ రెచ్చిపోయిందని అనుకున్నారంత. ఇక 2022లోకి అడుగుపెడుతూ... బంగార్రాజు చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతుంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కృతిశెట్టి... బంగార్రాజులో పల్లెటూరి అమ్మాయిగా నటించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపింది. విలేజ్ కల్చర్ ఎలా ఉంటుందో చూశానని చెప్పింది. బంగార్రాజులో నాగలక్ష్మి పాత్ర చాలా మాస్ గా ఉంటుందన్న కృతి.... మాట వింటే సర్పంచి నాగలక్ష్మి... మాట వినకపోతే సింగం నాగలక్ష్మిలా తన క్యారెక్టర్ ఉంటుందని తెలిపింది. శ్యామ్ సింగరాయ్ లో నానితో కలిసి రొమాన్స్ సీన్స్ గురించి కూడా ఏం దాచుకోకుండా చెప్పేసింది. చాలా మంది ముందు బెడ్ రూమ్ సీన్ చేశామని, షూటింగ్ పూర్తై ఇంటికి వెళ్లాక ఎలాంటి భయం కలగలేదని వివరించింది. తాను అన్ని రకాలుగా నటించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేందుకు అలా నటించానని చెప్పింది. ప్రేక్షకులు కూడా తనను బాగా అర్థం చేసుకున్నారని ఆనందం వ్యక్తం చేసింది. అయితే ఎప్పటికైనా ఒక యువరాణి పాత్రలో నటించాలన్నది తన కలని పేర్కొంది. ప్రపంచం గర్వించే స్థాయిలో ఉన్న తెలుగు సినిమాల్లో నటించడం ఎంతో గర్వకారణంగా ఉందన్న కృతిశెట్టి... తెలుగు ప్రేక్షకులకు సంక్రాంతికి సినిమాలు చూడటం పెద్ద పండుగని చెప్పింది. ప్రస్తుతం సుధీర్ బాబుతో ఒక అమ్మాయి గురించి మీకు చెప్పాలి, నితిన్ తో మాచర్ల నియోజకవర్గం, రామ్ తో లింగుస్వామి దర్శకత్వంలో తెలుగు, తమిళ చిత్రంలో నటిస్తున్న కృతి... లేడీ ఒరియెంటెడ్ చిత్రంలోనూ నటించేందుకు సిద్ధమవుతోంది. ఇలా వరుస సినిమాలతో తీరికలేకుండగా గడుపుతున్న కృతిశెట్టి.... ముంబయి నుంచి తన మకాం హైదరాబాద్ మార్చేసింది. జూబ్లీహిల్స్ లో ఓ ఖరీదైన భవనాన్ని కొనుగోలు చేసి ఎంజాయ్ చేస్తోంది. 

Post a Comment

Previous Post Next Post