తనకు వైకాపా రాజ్యసభ పదవి ఇస్తున్నట్లు కొన్ని మీడియాల్లో ప్రసారం అవుతున్న వార్తలపై మెగాస్టార్ చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సీంతో సమావేశానికి రాజకీయ రంగు పులుముతున్నారని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. తెలుగు సినీ పరిశ్రమ మేలు కోసం, థియేటర్ల మనుగడ కోసం మాత్రమే ముఖ్యమంత్రి జగన్ తో సమావేశమయ్యానని స్పష్టం చేసిన చిరంజీవి... సినీ పరిశ్రమ బాగు కోసం చర్చించిన విషయాలను పక్కదోవ పట్టిస్తున్నారన్నారు. తనను రాజ్యసభకు పంపుతున్నట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తలను ప్రసారం చేస్తున్నాయని పేర్కొన్న చిరంజీవి...ఆ వార్తలు పూర్తిగా నిరాధారమైనవని ఖండించారు. రాజకీయాలకు దూరంగా ఉంటున్న తాను మళ్లీ రాజకీయాలకు, చట్టసభలకు రావడం జరగదని తేల్చి చెప్పారు. తనపై వస్తున్న వార్తన్నీ ఊహాగానాలేనని, ఆ వార్తలకు, చర్చలకు ఇక్కడితో పుల్ స్టాప్ పెట్టాలని చిరంజీవి విజ్ఞప్తి చేశారు. మీడియా సంస్థలు న్యూస్ రాయాలి కానీ వ్యూస్ కాదని గట్టిగా హెచ్చరించారు. అదే హ్యాష్ ట్యాగ్ తో చిరంజీవి ట్విట్ చేశారు.
Post a Comment