"భీమ్లానాయక్.... క్యాప్షన్ లేకుండానే కలెక్షన్లు కొల్లగొట్టే "లాఠీనాయక్"

 

పవన్ కల్యాణ్, రానా ప్రధాన పాత్రలో నటించిన మూవీ భీమ్లానాయక్. సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, సంభాషణలు అందించారు. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రం అనుకున్నట్టుగానే ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా సుమారు 3 వేలకుపైగా థియేటర్లలో విడుదలైంది. తెలంగాణ అనుకూల, ఆంధ్రప్రదేశ్ లో ప్రతికూల పరిస్థితుల్లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద పవర్ ప్యాక్డ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మలయాళంలో ఘన విజయం సాధించిన అయ్యప్పనుమ్ కోషియమ్ చిత్రానికి రిమేక్ గా తీర్చిదిద్దిన ఈ మూవీ... మాతృక కంటే మరో మెట్టు  ఎక్కువగానే ప్రేక్షకులను అలరించింది. 
కర్నూలు జిల్లా హఠకేశ్వర్ మండల పోలీసు స్టేషన్ లో ఎస్సైగా పని చేస్తున్న భీమ్లా నాయక్(పవన్ కల్యాణ్)కు,  
రాజకీయంగా పలుకుబడి కలిగిన కుటుంబానికి చెందిన రిటైర్ ఆర్మీ ఆఫీసర్ డానియెల్ శేఖర్(రానా)కు మధ్య జరిగే 
ఆత్మగౌరవ పోరాటమే భీమ్లానాయక్ కథ. అహం దెబ్బతిన్న మనుషులు ఎంతకు తెగిస్తారు? ఫలితంగా వారి వ్యక్తి గత జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనేదే భీమ్లానాయక్ కథ. 
అయితే భీమ్లానాయక్ టైటిల్ పెట్టడంతో కేవలం పవన్ పాత్రను మాత్రమే ఎలివేట్ చేస్తారని ప్రేక్షకులు 
భావించారు. కానీ మాతృకలో మాదిరిగానే రానా పాత్రకూ న్యాయం చేసేలా సన్నివేశాలను చక్కగా తీర్చిదిద్దారు. ప్రతి 
సన్నివేశం ఒకదాని మించి మరోలా ఉంటుంది. తెరపై ప్రధానంగా పవన్- రానాలే కనిపిస్తారు. క్లైమాక్స్ ముందు వచ్చే ట్విట్ట్ 
మెప్పిస్తుంది. సిస్టర్ సెంటిమెంట్ తో సినిమాను ముగించిన విధానం బాగుంది. ఈ సినిమాకు వెన్నముక త్రివిక్రమ్ అనడంలో
ఏ మాత్రం అతిశయోక్తి లేదు. దర్శకుడు సాగర్ కె. చంద్ర మాతృకను తనదైన శైలిలో మల్చకగా... త్రివిక్రమ్ తన మాటలతో, 
తమన్ తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. భీమ్లానాయక్ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ తప్ప 
మరోకరిని ఊహించుకోలేం. అంతలా ఆ పాత్రను ఆకళింపు చేసుకొని కొత్త పవన్ ను తెరపై చూపించారు. పవన్ భార్యగా 
నిత్యామీనన్, రానా భార్యగా సంయుక్త మీనన్ తమ పాత్ర పరిధి మేరకు చక్కగా నటించారు. రావు రమేశ్, సముద్రఖని, 
తనికెళ్ల భరణి లాంటి సీనియర్ నటులు మెప్పించారు. సినిమా చివరలో న్యాయమూర్తిగా బ్రహ్మానందం నవ్వించే ప్రయత్నం 
చేశారు. పవన్ అభిమానులకైతే భీమ్లానాయక్ పెద్ద పండుగ.
     ఎంత పెద్దసినిమా అయినా ప్రేక్షకులకు ఎక్కడో అక్కడ అసంతృప్తి ఉంటుంది. అభిమానుల అంచనాల్లో కొన్ని మిస్ 
అయ్యాయి. మొగలియ్య పాడిన సాకీని జైల్లో సునిల్, సప్తగిరి, హైపర్ ఆదిలపై చిత్రీకరించడం పాటలో మైనస్ అని చెప్పాలి. 
సునిల్ కనిపించడం పూర్తిగా త్రివిక్రమ్ మార్కేనని స్పష్టంగా అర్థమవుతోంది. అలాగే నిత్యామీనన్, పవన్ కల్యాణ్ లపై వచ్చే"అంతఇష్టం ఏందయ్యా" పాట నిడివి ఎక్కువవుతున్న కారణంగా కోత పెట్టారు. 
మొత్తంగా "భీమ్లానాయక్.... క్యాప్షన్ లేకుండానే కలెక్షన్లు కొల్లగొట్టే "లాఠీనాయక్"









Post a Comment

Previous Post Next Post