పవన్ కల్యాణ్, రానా నటించిన భీమ్లానాయక్ చిత్రం బాక్సాఫీసు వద్ద దుమ్ము రేపుతోంది. మాస్ జాతరతో థియేటర్లన్నీ ప్రేక్షకులతో కళకళలాడుతున్నాయి. అయితే ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, సంభాషణలు రాసిన త్రివిక్రమ్... భీమ్లానాయక్ పై తొలిసారిగా స్పందించారు. భీమ్లానాయక్ కు తాను ఎందుకు పనిచేయాల్సి వచ్చిందో వివరించారు. " అయ్యప్పనుమ్ కోషియుమ్" కథ చాలా గొప్ప కథగా పేర్కొన్నారు. అలాంటి గొప్ప కథలు దృతరాష్ట్రుడి కౌగిలి లాంటివన్నారు. మాతృకపై ప్రేమను చంపుకోవాలంటే ప్రయోగాలు చేయక తప్పదన్నారు. పవన్‌కల్యాణ్‌లాంటి స్టార్‌తో సినిమా అంటే అభిమానులు ప్రేక్షకులు కోరుకునే అంశాలు మిస్ కాకుండా ఉండాలనే ఉద్దేశంతో తాను రంగంలోకి దిగాల్సి వచ్చిందని తెలిపారు. త్రివిక్రమ్ భీమ్లానాయక్ గురించి ఇంకా ఏమన్నారంటే....
" మాతృకలో కథ అంతా కోషి వైపు నుంచి చెప్పబడింది. భీమ్లానాయక్ వైపు తీసుకురావడానికి ఎలా బ్యాలన్స్ చేయాలి. ఈ సినిమా రీమేక్ అనుకున్నప్పుడు మాకు ఎదురైన తొలి సవాల్ ఇది. కథను ఎలా మార్చుకురావాలి అన్న దానిపై మా చర్చలు మొదలయ్యాయి. అడవికి సెల్యూట్ చేస్తూ ‘భీమ్లానాయక్’ క్యారెక్టర్‌ను అడవికి మరింత దగ్గర చేస్తే అతనికి జస్టిఫికేషన్ దొరుకుతుందనిపించింది. మాతృక నుంచి బయటకు రావడానికి మేం చాలా ప్రయత్నాలు చేశాం. చివరికి భీమ్లా అయినా ఉండాలి.. లేదా డ్యాని అయినా ఉండాలి... లేదంటే ఇద్దరూ ఫ్రేమ్‌లో ఉండాలి. అందుకే క్లైమాక్స్ వచ్చేసరికి ఇద్దరూ ఉండేలా చేశాం. ఇద్దరికీ యూనిఫామ్ జర్నీ ఉండాలనుకున్నాం. భీమ్లా భార్య పెరగమంటుంది. డ్యాని భార్య తగ్గమంటుంది.. సరిగ్గా గమనిస్తే ప్రతి సీన్‌కు కౌంటర్ ఉంటుంది. 'అయ్యప్పనుమ్ కోషియుమ్’ నుంచి బయటకు రావడానికి ఇవన్నీ చేశాం. మాతృక గొప్ప కథ. దృతరాష్ట్రుడిలా కౌగిలించుకుని వదిలిపెట్టకపోవడం అనేది గొప్ప కథ లక్షణం. మాతృక ప్రేమను చంపుకోవాలంటే ఇలాంటి ప్రయోగాలన్ని చేయాలి. పవన్‌కల్యాణ్‌లాంటి స్టార్‌తో సినిమా అంటే చాలా విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. ఆయన్ని ఎలివేట్ చేయడానికి చేసే ప్రయత్నాలు ఆర్టిఫియల్‌గా ఉండకూడదు. అభిమానులు ప్రేక్షకులు కోరుకునే అంశాలు మిస్ కాకుండా ఉండాలి. అవన్నీ బ్యాలెన్స్ చేయడానికి మేం ఎక్కువ కష్టపడ్డాం. ఆ తర్వాత అన్ని ఈజీగా జరిగిపోయాయి. కరోనా ఒక్కటే మాకు గ్యాప్ వచ్చేలా చేసింది. అభిమానులు మెచ్చేలా పవన్‌ని తెరపై చూపించడానికి సాగర్ చాలా కష్టపడ్డారు. తనకి సపోర్ట్‌గా మేమంతా ఉన్నామని ధైర్యం చెప్పాం. కల్యాణ్‌గారికి తను చెప్పలేని విషయాలను వారధిలా ఉండి మేం చెప్పాం. కొవిడ్ సమయంలో పవన్ కల్యాణ్, రానా ఎలాంటి భయం లేకుండా జనాల మధ్య పనిచేశారు.
మా సినిమాకు మంచి ఆర్టిస్ట్‌లు, టీమ్ కుదిరింది. చిన్నచిన్న పాత్రలు కూడా ఎలివేట్ అయ్యారు. ప్రతి ఆర్టిస్ట్ స్ర్కిప్ట్‌ను చదివి మేం చెప్పినదాని కన్నా బాగా నటించారు. ఈ మధ్యకాలంలో వస్తున్న ఆర్టిస్ట్‌ల్లో చాలా పర్ఫెక్షన్ ఉంది. న్యూ జనరేషన్ ఆర్టిస్ట్‌లు ఎంతో టాలెంట్ ఉన్న వ్యక్తులని అర్థమవుతోంది. ఇప్పటితరం వాళ్లకు సినిమాపై ప్రేమ, ప్రతివిషయంలో వాళ్లకున్న అవగాహన గొప్పది. ఐదేళ్లుగా నేనీ విషయాన్ని గమనిస్తున్నా. ఇక డాన్స్‌ల విషయానికొస్తే గణేశ్ మాస్టర్ స్టెప్పులు బాగా కంపోజ్ చేశారు. 600 మందితో సాంగ్ షూట్ చేయడం సాధారణ విషయం కాదు. ఆ సాంగ్ షూట్ జరుగుతున్న సమయంలో సెట్‌లోకి వెళ్లగానే అంతమంది జనాన్ని చూసి భయంవేసింది. కానీ మూడు రోజుల్లో ఆ సాంగ్ పూర్తి చేశారు. సాగర్‌కు వచ్చిన ఐడియాతోనే మొగిలయ్యతో టైటిల్ సాంగ్ పాడించాం. ఆయనకు పద్మశ్రీ రావడం.. ఎంతో ఆనందం కలిగించింది. జానపద కళాకారులతో అనుకుని పాడించలేదు. అలా కుదిరాయంతే. తమన్ నేను కథ చెప్పగానే పాటలిచ్చేస్తాడు. అతను ఈ మధ్య సంగీతంతో మాట్లాడుతున్నాడు."
Post a Comment